
మాట్లాడే ఇళ్ళు
మాట్లాడే ఇళ్ళు కొన్ని ఇళ్ళు మనం నివసించడానికి ఉంటాయి. కొన్ని ఇళ్ళు మాత్రం… మనతో మాట్లాడతాయి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన ఒక ఇల్లు ఉంది. నాలుగు వైపులా వరండాలు. మధ్యలో ఒక మండపం. తులసి. గాలి తిరగడానికి ఖాళీ. మధ్య మధ్యలో నిశ్శబ్దం. ఇన్నేళ్లుగా చూసిన అదే ఇల్లు, ఇటీవల అలమండ వెళ్లినప్పుడు నాకు కొత్తగా కనిపించింది. ఎందుకో తెలియదు. బహుశా ఇల్లు మారలేదు. నేనే మారి ఉండొచ్చు. ఆ ఇంటిని చూస్తుంటే నేపాల్‌లోని తాన్సేన్‌లో చూసిన ఇళ్ళు గుర్తొచ్చాయి. తర్వాత ఎక్కడో Pinterestలో స్పెయిన్ courtyard houses కనిపించాయి. మెక్సికోలోని పాత వరండాలు కనిపించాయి. దేశాలు వేరు. భాషలు వేరు. వాతావరణాలు కూడా వేరు. కానీ ఆ ఇళ్ళలో ఏదో పరిచయం. మధ్యలో ఆకాశం కనిపించే ఖాళీ. దాని చుట్టూ కుటుంబం. వెలుతురు లోపలికి రావడానికి చోటు. గాలి తిరగడానికి దారి. బయట ప్రపంచం ఎంత హడావుడిగా ఉన్నా, ఇంటి మధ్యలో మాత్రం ఒక ప్రశాంతత. అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. మన పాత ఇళ్ళు కేవలం నిర్మాణాలా? లేక మన జీవన విధానాన్ని అర్థం చేసుకున్న ఒక జ్ఞానమా? ఈ అంతరంగాలు ఎపిసోడ్‌లో నేను architecture గురించి మాత్రమే మాట్లాడటం లేదు. మన ఇళ్ళు మనల్ని ఎలా మలిచాయి? ఒక courtyard కుటుంబాన్ని ఎలా దగ్గర చేసింది? వరండా ఎందుకు కేవలం passage కాదు? మనం modern houses కట్టుకుంటూ comfort సంపాదించామా… లేక తెలియకుండానే కొన్ని అనుబంధాలను కోల్పోయామా? ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం - ప్రపంచంలో ఒకరినొకరు కలవని సమాజాలు కూడా ఎందుకు ఇలాంటి ఇళ్ళనే నిర్మించాయి? బహుశా architecture అనేది drawing board మీద మొదలయ్యేది కాదు. మనిషి ఎలా జీవించాలనుకుంటాడో అక్కడ మొదలవుతుంది. ఇప్పుడు పాత ఇళ్ళను చూస్తే, నాకు గోడలు మాత్రమే కనిపించవు. అందులో నివసించిన వాళ్ళ అలవాట్లు కనిపిస్తాయి. వాళ్ళ మధ్య ఉన్న దూరాలు కనిపిస్తాయి. వాళ్ళ దగ్గరితనం కనిపిస్తుంది. వాళ్ళు ప్రకృతితో చేసుకున్న చిన్న చిన్న ఒప్పందాలు కనిపిస్తాయి. అందుకే కొన్ని ఇళ్ళు కూలిపోయినా వాటి కథలు మిగిలిపోతాయి. కొన్ని ఇళ్ళు మనం వదిలేసినా… అవి మనల్ని వదిలిపెట్టవు. బహుశా అందుకే అవి ఇంకా మాట్లాడుతూనే ఉంటాయి.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
