
వంటింటి కథలు ...గాధలు
వంటింటి కథలు... గాధలు కొన్ని జ్ఞాపకాలకు ఫోటోలు ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలకు మాత్రం వాసనలు ఉంటాయి. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తుంటే విశాఖలో చలి గాలి. అలా వెళ్తూ గానుగ దగ్గర ఆగాను. నువ్వుల నూనె వాసన మధ్య అనుకోకుండా కంటపడింది - తెలగపిండి. అంతే. మనసు ఒక్కసారిగా చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. వేడి వేడి అన్నం. తెలగపిండి. కాస్త నువ్వుల నూనె. పక్కన పచ్చి ఉల్లిపాయ. ఇంటికి తీసుకెళ్లిన తెలగపిండిని చూసిన వెంటనే ఉదయ అమ్మగారికి ఏం చేయాలో తెలుసు. Recipe book లేదు. YouTube లేదు. Measurements లేవు. చేతికి తెలుసు. జ్ఞాపకానికి తెలుసు. అక్కడే నాకు ఒక ఆలోచన వచ్చింది. మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు తెలిసిన ఈ చిన్న చిన్న వంటలు, పద్ధతులు, కొలతలు, చిట్కాలు… ఇవన్నీ ఎక్కడ భద్రపడుతున్నాయి? “అందాజా” అని ఒక పిడికెడు వేసే ఉప్పు ఏ cookbookలో ఉంటుంది? వంట పూర్తయిందో లేదో వాసనతో చెప్పగలిగే ఆ జ్ఞానం ఏ databaseలో ఉంది? ఈ అంతరంగాలు ఎపిసోడ్ తెలగపిండి గురించి మాత్రమే కాదు. మన వంటింట్లో నెమ్మదిగా కనుమరుగవుతున్న ఒక oral tradition గురించి. మా శంకర్ మావయ్య పాత, గిరిజన వంటకాలను సేకరించి ఒక Ethnic Café చేయాలనుకున్న కల గురించి. మన తర్వాతి తరానికి recipes మాత్రమే కాకుండా రుచుల వెనుక ఉన్న కథలను కూడా అందించాల్సిన అవసరం గురించి. ఈ రోజుల్లో లక్షల cooking videos ఉన్నాయి. కానీ మన ఇంటి వంటలో ఉండేది content కాదు. అందులో అమ్మ చేతి కొలత ఉంటుంది. అమ్మమ్మ జ్ఞాపకం ఉంటుంది. ఒక ప్రాంతపు నేల ఉంటుంది. ఒక కుటుంబపు చరిత్ర ఉంటుంది. అందుకే నాకు ఇప్పుడు వంటిల్లు ఒక kitchenలా మాత్రమే కనిపించదు. అది ఒక library. మన పెద్దవాళ్లు అందులోని living books. వాళ్లు మనతో ఉన్నప్పుడే వాళ్లను చదువుదాం. వాళ్ల కథలు వినుదాం. వాళ్ల recipes రాసుకుందాం. ఎందుకంటే కొన్ని రుచులు ఒకసారి పోతే… మళ్లీ అదే రుచిగా తిరిగి రావు.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
